వికసిత్ భారత్‌లో ఏపీ పాత్ర కీలకం: డిప్యూటీ సీఎం పవన్|

0
0

బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే, మరో తరం దానిని కాపాడిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ సంకల్పంలో ఏపీ కూడా తనదైన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు.

 

అంతకుముందు పవన్ కల్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.