కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. “ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి” అని ఆయన పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.










