ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ను దేశానికే ఆదర్శంగా నిలిపేలా 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపుతున్నారు. వీరు ఆగస్టు 17 నుంచి 26 వరకు అక్కడి టుర్కు విశ్వవిద్యాలయంలో ‘అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం’ కింద వినూత్న బోధనా పద్ధతులపై 8 రోజులపాటు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌లో 37 మందికి సింగపూర్‌లో శిక్షణ ఇప్పించారు. మొత్తం మూడు దశల్లో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే విజయవాడలో నలుగురు ఫిన్నిష్ నిపుణులతో మొదటి దశ ఓరియంటేషన్ పూర్తయింది. ఈ శిక్షణ ద్వారా రాష్ట్రంలో బోధనా నాణ్యత మరింత మెరుగుపడనుంది.










