ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమని కొనియాడారు.
స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మరియు అమరవీరుల నిరంతర పోరాటాలు, ప్రాణ త్యాగాల వల్లే దేశానికి స్వేచ్ఛ లభించిందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తెస్తున్నాయని వివరిస్తూ, మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 2.41 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారని ఆయన తెలిపారు.
అలాగే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా బండ ప్రకాష్ గారు స్పష్టం చేశారు.










