ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని చాటే అద్భుతమైన కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. ఉన్నతాధికారులే స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అక్కడ ఉన్న వారందరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది.
ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ. రక్తదానం అనేది మరొకరికి ప్రాణదానంతో సమానమని అన్నారు. ఆపదలో ఉండి అత్యవసరంగా రక్తం కావాల్సిన వారికి మనం చేసే రక్తదానం కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, కేవలం మానవతా దృక్పథంతో చేసే దానం ద్వారానే ప్రాణాలను కాపాడగలమని గుర్తుచేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, ప్రాణదాతలుగా నిలిచి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు మరియు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.









