22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలి.|

0
9

● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

● 30 వేల కుటుంబాలకు ఉపశమనం కల్పించాలి

● 22ఏ అంశంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పోరాటం: హరీష్ రావు.

మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి నియోజకవర్గంలోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి, సంబంధిత యజమానులకు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరిలో కీలక సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 22ఏ జాబితా కారణంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో దాదాపు 30 వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన ఆస్తులను అవసరాల కోసం విక్రయించేందుకు వెళ్లిన సమయంలో నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలియడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.

పిల్లల వివాహాలు, ఉన్నత విద్య, వైద్యం వంటి అత్యవసర అవసరాలకు సొంత ఆస్తులను విక్రయించుకోలేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించాలని కోరారు.

హరీష్ రావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త ఇబ్బందులకు కారణమవుతోందని విమర్శించారు. ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా కాలనీలకు కాలనీలను 22ఏ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆస్తుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

2008లో అప్పటి ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC)ను రద్దు చేసిన అనంతరం అనేక భూములు పట్టా భూములుగా మారి, ప్రజలు ఏళ్లుగా వాటిపై హక్కులతో నివసిస్తున్నారని వివరించారు. ఇన్నాళ్లు లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భూమి విక్రయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందనే విషయం తెలియకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించి కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, ప్రభుత్వం స్వయంగా వివరాలను పరిశీలించి అర్హత ఉన్న భూములను తొలగించాలని సూచించారు.

22ఏ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని, నిషేధిత జాబితాలో చేర్చినవి, అనంతరం తొలగించిన ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ సేవలు కూడా సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 22ఏ సమస్యపై అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, 22ఏ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తమ ఆస్తులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

#sidhumaroju

Alwal