ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో ఈ నెల 20న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భారతి 400 మీటర్ల పరుగు పందెంలోనూ, నిఖిలేష్ షాట్‌పుట్ విభాగంలోనూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీలలో హనుమకొండ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికై జిల్లా కీర్తిని చాటిన విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి, రాబోయే పోటీల్లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.










