చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

0
1

చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.మణిమాల గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు భాషకు,సరళత,సమానత్వం, ప్రజల నాఢీకి దగ్గరగా ఉండేలా చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు అని, పండితులకే పరిమితమైన గ్రాంథిక భాషను కాదని, సామాన్యులు మాట్లాడే వాడుక భాషను ( వ్యవహారిక భాష ) సాహిత్యానికి, చదువుకు అనుకూలంగా మార్చాలని ఆయన పోరాడారన్నారు.

గిడుగు రామ్మూర్తి చేసిన కృషి వల్ల చదువు అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర దేశంలో వ్యవహారకభాషా ఉద్యమానికి మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మకత శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి విద్యను అందేలా చేశారని, శిష్ట జన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు రామ్మూర్తి అనీ కొనియాడారు. తెలుగు విభాగధిపతి కె.లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో

ముఖ్యుడని,ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి, ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వై.పద్మ, డాక్టర్ జి.ఝాన్సీ, ఆర్ మౌనిక, జి.సాయికుమార్ బి. శ్రీనివాసరావు, కె.కీర్తి, ఆర్.కిరణ్మయి, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

# Yadagiri