అన్నమయ్య జిల్లాలో పోలీసుల ‘పల్లె నిద్ర’
అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు గ్రామాల్లో భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు గ్రామాల్లో బస చేశారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక ప్రజలు, యువతతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాలో తప్పుడు లేదా వివాదాస్పద పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి భద్రతకు సహకరించాలని ప్రజలను కోరారు.










