నర్సు మృతి వెనుక మిస్టరీ.. తుక్కుగూడలో ఉద్రిక్తత.|

0
3

● సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన.. ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల యువతి మృతదేహం

● హత్య కోణంలో దర్యాప్తు.. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాల సేకరణ

● ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళన.. కొంతసేపు ఉద్రిక్తత

అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఊకే శిరీషగా పోలీసులు గుర్తించిన యువతి.. ఆసుపత్రిలోని నివాస గదిలో మృతిచెంది కనిపించింది.

శనివారం రాత్రి గదిలోకి వెళ్లిన ఆమె.. మరుసటి రోజు బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది అనుమానంతో పరిశీలించగా మృతదేహం కనిపించినట్లు తెలుస్తోంది. ముఖంపై గాయాలు ఉండటంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సమాచారం అందుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘటనపై పోలీసులు హత్య కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా మృతికి అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

ప్రస్తుతం పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

#sidhumaroju

Alwal