🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను ఘోరంగా దగా చేసిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, నేటికి 1000 రోజులు గడిచినా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.










