Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
“కుల వివక్షకు చరమగీతం పాడాలి.. దళిత, గిరిజనులకు న్యాయం చేయాలి” అనే డిమాండ్‌తో మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక మేరకు దళిత, గిరిజనులకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తిస్థాయిలో కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేసి భూమిలేని ప్రతి దళిత వ్యవసాయ కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని కోరారు.










