రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.

0
1

రూ.5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

నిన్న ఉదయం నుంచి తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. సుదీర్ఘంగా సాగిన ఈ తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

సోదాల్లో భాగంగా లోకనాథం నివాసం నుంచి సుమారు 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన భార్య, కుమారుడి పేర్లపై పలుచోట్ల ఇళ్లు, విలువైన స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

నిన్న ప్రారంభమైన సోదాలు పూర్తైన అనంతరం.. ఈరోజు లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

టీటీడీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ ఈవోను ఏసీబీ అరెస్ట్ చేయడం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. అయితే స్వాధీనం చేసుకున్న ఆస్తులు అక్రమాస్తులేనన్న అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది నిర్ధారణకు రావాల్సి ఉంది.

ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు మరింత ముందుకు సాగితే మరిన్ని ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.