వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ.. రూ.40 కోట్ల డీల్‌పై దస్తగిరి విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆర్థిక లావాదేవీల కోణంపై దృష్టి సారించింది. హత్యకు సంబంధించిన డబ్బు లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాలపై అధికారులు విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.
కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు మరికొందరి మధ్య సుమారు రూ.40 కోట్ల మేరకు డీల్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపైనా ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక ఆధారాలు, లావాదేవీలపై దస్తగిరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అలాగే వివేకానందరెడ్డి హత్యకు రూ.5 కోట్లకు ఒప్పందం కుదిరిందని దస్తగిరి గతంలో వాంగ్మూలం ఇచ్చినట్లు దర్యాప్తులో పేర్కొన్న అంశాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు, వాంగ్మూలాల్లోని అంశాలను దర్యాప్తు సంస్థలు పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది.
ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చే ఆర్థిక లావాదేవీలు కేసు దర్యాప్తులో ఎలాంటి కీలక ఆధారాలుగా మారుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.










