బాపట్లలో ఉద్యోగుల నిరసన.. డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ |

0
1

బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ‘‘సీఎం సార్‌.. మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.

ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్‌), ఇతర ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమకు రావాల్సిన బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన దశలవారీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అలాగే వాట్సాప్‌ డీపీలు, స్టేటస్‌ల ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.

ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి దశలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.