హాషిష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు.|

0
11

● ముగ్గురు డ్రగ్స్ క్యారియర్ల అరెస్ట్

● 12 కేజీల హాషిష్ ఆయిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం

● ఇద్దరు సూత్రధారులు, మరో వ్యక్తి కోసం గాలింపు

ఆల్వాల్, సెప్టెంబరు 8: నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందం, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి, సుమారు రూ.1.5 కోట్ల విలువైన 12 కేజీల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన బొనాంగి హరిచంద్ర ప్రసాద్ (30) ఆటో డ్రైవర్, సయ్యద్ రజా ఇమామ్ (49) ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారి, సీరుం గంగాధర్ (40) టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

వీరు హాషిష్ ఆయిల్‌ను తరలించే క్యారియర్లుగా వ్యవహరిస్తున్నట్లు విచారణలో గుర్తించామని చెప్పారు.

ప్రధాన సూత్రధారులుగా ఉన్న మార్క్ అలియాస్ రిషి, విజయ్ ఆదేశాల మేరకు ముగ్గురు నర్సీపట్నం నుంచి 12 కేజీల సరుకును వాయిలెట్ రంగు బ్యాగ్‌లో పెట్టుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈసీఐఎల్‌లో ఓ వ్యక్తికి దానిని అప్పగించాల్సి ఉందని సీపీ తెలిపారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్ఓటీ ఉప్పల్ జోన్, కుషాయిగూడ పోలీసు బృందాలు సెప్టెంబరు 7న మధ్యాహ్నం నాగార్జున నగర్ కాలనీ, రోడ్ నంబర్ 5 వద్ద నిఘా ఏర్పాటు చేశాయి.

అక్కడ సరుకు అప్పగించేందుకు ఎదురుచూస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, బ్యాగ్‌ను తనిఖీ చేయగా 12 కేజీల హాషిష్ ఆయిల్ లభించింది. మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో మార్క్ అలియాస్ రిషి, విజయ్‌తో పాటు ఈసీఐఎల్‌లో సరుకు తీసుకోవాల్సిన వ్యక్తి పరారీలో ఉన్నారని సీపీ సుమతి చెప్పారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన ప్రత్యక్ష పర్యవేక్షణలో డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ వెంకట్ రెడ్డి, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించినట్లు సీపీ తెలిపారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు అందించి సమాజ శ్రేయస్సుకు సహకరించాలని సీపీ సుమతి కోరారు.

#Sidhumaroju

Alwal