🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో స్పందించి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఉదార సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే… ఆసిఫాబాద్ మండల పరిధిలోని మాణిక్‌గూడ గ్రామానికి చెందిన చంద్రకళ అనే గర్భిణి మహిళ చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు అత్యవసరంగా O+ పాజిటివ్ (O Positive) రక్తం కావాలని పేషెంట్ బంధువులకు సూచించారు. బ్లడ్ బ్యాంక్‌లో రక్తం అందుబాటులో లేకపోవడంతో.
ఏం చేయాలో పాలుపోని స్థితిలో పేషెంట్ బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ క్లిష్ట సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు తమ గ్రామ ఉపసర్పంచ్ అజయ్‌ను సంప్రదించి సహాయం చేయాల్సిందిగా కోరారు. విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ అజయ్ వెంటనే చొరవ తీసుకుని, గ్రామానికి చెందిన గోగుల అరవింద్ అనే యువకుడిని సంప్రదించగా…
అతడు రక్తదానం చేసేందుకు వెంటనే ముందుకు వచ్చారు.ఆలస్యం చేయకుండా గోగుల అరవింద్ ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ చేరుకుని గర్భిణి చంద్రకళ ప్రాణాలు కాపాడటం కోసం రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందడంతో గర్భిణి ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. సమయానికి స్పందించి ఒక గర్భిణి ప్రాణాన్ని కాపాడిన యువకుడు గోగుల అరవింద్‌ను, ఇందుకు అండగా నిలిచిన ఉపసర్పంచ్ అజయ్‌ను ఆసుపత్రి వైద్య సిబ్బంది, రోగి బంధువులు మరియు పలువురు గ్రామస్తులు ఘనంగా అభినందించారు.









