బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసులో తాజా పరిణామం.|

0
6

● మేజర్‌ జనరల్‌ నేతృత్వంలో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ

● ఆయుధాగారం భద్రతా లోపాలపై ప్రత్యేక దృష్టి

● పోలీసుల దర్యాప్తుతో సమాంతరంగా ఆర్మీ విచారణ

అల్వాల్, సెప్టెంబర్ 21: బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ ఘటనపై ఆర్మీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. 

సదరన్‌ కమాండ్‌ ఆదేశాలతో మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ఏర్పాటు చేశారు. ఘటనకు దారితీసిన భద్రతా, విధానపరమైన లోపాలను కమిటీ పరిశీలిస్తోంది.

ఆగస్టు 30-31 రాత్రి జరిగిన ఘటనలో నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఒక 5.56 ఎంఎం ఇన్సాస్‌ రైఫిల్‌, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక సివిలియన్‌ 6.35 బోర్‌ పిస్టల్‌, 21 మ్యాగజైన్లు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌, 1,900కు పైగా రౌండ్ల మందుగుండు సామగ్రి చోరీకి గురయ్యాయి. దర్యాప్తులో మొత్తం ఆయుధాలు, సామగ్రిని పోలీసులు రికవరీ చేశారు.

ఈ కేసులో మాజీ ఆర్మీ హవల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం పరిసరాలను పరిశీలించిన మల్లేష్‌.. 30వ తేదీ రాత్రి అక్కడికి చేరుకుని తాళాలు పగులగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అనంతరం వాటిని నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో దాచినట్లు గుర్తించారు.

కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీలో ఆయుధాగారం వద్ద భద్రతా విధానాలు, ప్రవేశ నియంత్రణ, సెంట్రీ వ్యవస్థ, రాత్రి నిఘా, ఆయుధాల నిల్వకు సంబంధించిన ప్రక్రియలను పరిశీలిస్తున్నారు. ఘటన సమయంలో భద్రతా వ్యవస్థలో ఏయే లోపాలు చోటుచేసుకున్నాయన్న దానిపై విచారణ సాగుతోంది.

మరోవైపు మల్లేష్‌కు మరెవరైనా సహకరించారా అనే కోణంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతని కమ్యూనికేషన్‌ వివరాలు, ఇతర డిజిటల్‌ ఆధారాలను పరిశీలిస్తున్నారు. మల్లేష్‌ ఫోన్‌ చాట్స్‌ తొలగించినట్లు దర్యాప్తులో గుర్తించడంతో ఆ సమాచారాన్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.

పోలీసుల క్రిమినల్‌ దర్యాప్తుతో పాటు ఆర్మీ కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కొనసాగుతుండటంతో బొల్లారం ఆయుధాల చోరీ ఘటనలో భద్రతా వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

#Sidhumaroju

Alwal