వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.










