ఎంపీడీవో తీరుపై ఎంపీపీ రమాదేవి అసంతృప్తి
నందిగామ, సెప్టెంబర్ 23: నందిగామ ఎంపీపీగా తన 18 నెలల పదవీకాలం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో ప్రసాద్ తీరుపై ఎంపీపీ పెసరమల్లి రమాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టే పలు పనులకు ఎంపీడీవో అడ్డంకులు కల్పించారని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధిగా తనకు దక్కాల్సిన గౌరవం, సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయిలో తనకు సంతృప్తి ఉన్నప్పటికీ, మండలస్థాయిలో మాత్రం అసంతృప్తి ఉందన్నారు. మండల పరిషత్ కార్యాలయం ప్రజలకు సేవ చేసే కార్యాలయంగా ఉండాలి తప్ప, పార్టీ కార్యాలయంగా మారకూడదని పేర్కొన్నారు.
ఎంపీటీసీ సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. గతంలో జరిగిన అటెండర్ ఘటనను ప్రస్తావిస్తూ ఎస్సీల పట్ల కూడా చిన్నచూపు ధోరణి ఉందని అన్నారు. ఒక షాపు విషయంలో తన ప్రమేయం లేకుండానే పార్టీకి చెందిన వారితో కలిసి గూడుపుటాణి చేశారని ఆమె ఆరోపించారు.
మహిళా ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రమాదేవి పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారశైలి కలిగిన ఎంపీడీవో వల్ల ప్రజాప్రతినిధులకు, మండల ప్రజలకు ప్రయోజనం ఉండదని అన్నారు. ఇకనైనా మండల పరిషత్ కార్యాలయం అధికారిక విధులకు, ప్రజాసేవకు వేదికగా ఉండాలని కోరారు.
తనకు 18 నెలల పాటు ఎంపీపీగా అవకాశం కల్పించిన మండల ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










