లారీ ఢీకొని నుజ్జునుజ్జైన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నందిగామ, సెప్టెంబర్ 23 : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న బస్సును కూడా ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుడిని గండేపల్లికి చెందిన షేక్ రావ్ పాషా (38), తండ్రి బడేమియాగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయనకు రెండు కాళ్లు, ఒక చేయి విరిగినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న కీసర టోల్ అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










