డాక్టర్ సంగయ్యకు ఘన సన్మానం

0
4

నందిగామ, సెప్టెంబర్ 21 భారత్ అవాజ్: కాకాని వెంకటరత్నం కళాశాల తెలుగు శాఖ విశ్రాంత శాఖాధ్యక్షులు డాక్టర్ లగడపాటి సంగయ్యను కళాశాల అక్టా బ్రాంచ్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. కాకతీయుల శాసనాలపై పరిశోధన చేసి ఆయన రచించిన ‘కాకతీయుల శాసనాలలో ఛందోవైవిధ్యం’ గ్రంథానికి 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర తెలుగు విశ్వవిద్యాలయం వచన రచనా విభాగంలో ఉత్తమ రచనా పురస్కారం లభించిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కళాశాల అక్టా చైర్మన్ డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన, అక్టా సెక్రటరీ యు. వాసుదేవరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సంగయ్య తన పరిశోధన, గ్రంథ ప్రాధాన్యాన్ని వివరించారు. శాసనాలపై పరిశోధన చేసేవారికి, ఛందస్సును అధ్యయనం చేసేవారికి ఈ గ్రంథం రిఫరెన్స్ గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు.తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ చాట్ల కిషోర్ పుస్తక పరిచయం చేశారు. డాక్టర్ సంగయ్య కళాశాల విశ్రాంత అధ్యాపకులు కావడం కళాశాలకు గర్వకారణమని అక్టా సెక్రటరీ వాసుదేవరావు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాయప్ప ఆయన పరిశోధనా ప్రతిభను అభినందించారు.
కార్యక్రమంలో పలువురు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని డాక్టర్ సంగయ్యకు అభినందనలు తెలిపారు. వాసుదేవరావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.