తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం లక్ష్మీ నగర్ కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న కొండచరియలను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండవాలు ప్రాంత ప్రజల రక్షణ దృష్ట్యా ఇప్పటికే మెజారిటీ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ (రక్షణ గోడలు) నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మిగిలి ఉన్న పెండింగ్ రక్షణ గోడల పనులను కూడా యుద్ధప్రాతిపదికన త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర అంచున ఉన్న ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. వర్ష తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










