రైతుల తరఫున ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు
నందిగామ, సెప్టెంబర్ 23: ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి నందిగామ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
వీరులపాడు మండల పరిధిలోని గ్రామాల్లో రైల్వే లైన్ కోసం చేపడుతున్న భూసేకరణలో రైతులకు 1.25 రెట్లు నష్టపరిహారం మాత్రమే ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని జగన్మోహన్రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి విలువ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉందని తెలిపారు.
ఇదే రైల్వే లైన్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో భూములు కోల్పోతున్న రైతులకు ఐదు రెట్ల నష్టపరిహారం ఇస్తున్నారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోనూ రైల్వే లైన్ నిర్వాసిత రైతులకు ఐదు రెట్ల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆవుల రమేష్‌బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటేరు ముత్తారెడ్డి, అల్లు ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి మల్లికార్జునరావు, ఎంపీటీసీ శీలం రమణారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.










