బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ, గురువారం ఉదయం వరకు కొనసాగింది. తీరాన్ని దాటినప్పటికీ, భూభాగంపై ఇది ఇప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.










