అమరావతి కేసులపై విచారణ వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

0
1

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంపై గత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 29న విచారణ జరగనున్న నేపథ్యంలో, తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ బి.ఎస్. భానుమతిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

 

విచారణ సందర్భంగా, ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటికీ అందలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయించాలని వారు కోరారు. దీనిపై అడ్వకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ, రాజధాని ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని కోర్టుకు వివరించారు. కీలక ప్రాజెక్టులను మూడేళ్ల కాలపరిమితిలో పూర్తి చేస్తామని 2024 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.