• ఇంటింటికీ వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేసిన ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు)
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, విశాఖపశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) అన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు పరిధిలోని కార్వెల్ నగర్, సాయి నగర్, సూర్యనగర్ మరియు కొత్తపాలెం ప్రాంతాలలో గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ఆప్యాయంగా పలకరించి పింఛన్ మొత్తాన్ని అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ:
• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ‘ఎన్టీఆర్ భరోసా’ కింద పెంచిన పింఛన్లను ఒకటో తేదీనే బాధ్యతగా లబ్ధిదారుల చేతికి అందిస్తోందని తెలిపారు.
• వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 4,000, దివ్యాంగులకు వైకల్యం శాతాన్ని బట్టి రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు, అలాగే పూర్తిస్థాయి దివ్యాంగులకు (తీవ్ర వైకల్యం / పడకకే పరిమితమైన వారికి) నెలకు రూ. 15,000 అందజేస్తూ వారి జీవితాలకు కొండంత అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రాణాంతక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులకు నెలకు రూ. 10,000 పింఛన్ అందిస్తూ వారి చికిత్స, జీవన అవసరాలకు ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తోందని వివరించారు.
• ప్రతి నెలా ఒకటో తేదీనే ఎండనక, వాననక నేరుగా ఇంటింటికీ వెళ్లి పింఛన్ నగదు అందించే గొప్ప సేవా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమవుతోందని కొనియాడారు.
• కాలనీల పర్యటనలో భాగంగా స్థానికులు తెలిపిన మౌలిక వసతులు, డ్రైనేజీ, రహదారుల సమస్యలపై ఆయన తక్షణమే స్పందించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమవతి, ఏపీడీ చిరంజీవి, ఈఈ మాధవ్, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వర్ణ వార్డు కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










