క్రీడా రంగంలో దేశీయ సంప్రదాయ విద్యలకు ప్రోత్సాహం అవసరం: ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)

0
2

• విశాఖలో ఘనంగా ప్రారంభమైన 37వ విద్యాభారతి జాతీయ స్థాయి మల్లఖంబ్ పోటీలు

• ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశిష్ట అతిథిగా ప్రభుత్వ విప్ గణబాబు హాజరు

• మల్లఖంబ్ క్రీడను ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపు

 

విశాలాక్షినగర్‌లోని శ్రీమతి పి.టి.వి.ఎస్. రావు బి.వి.కె. హైస్కూల్ & జూనియర్ కళాశాల ప్రాంగణంలో ‘విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 37వ జాతీయ స్థాయి మల్లఖంబ్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) విశిష్ట అతిథిగా విచ్చేశారు.

 ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) మాట్లాడుతూ, భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ విద్యాభారతి దేశవ్యాప్తంగా అనేక విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. కుస్తీ, యోగా, జిమ్నాస్టిక్స్ కలయికగా సాగే మల్లఖంబ్ మన నేల సంప్రదాయ క్రీడ అని కొనియాడారు. చిన్నతనం నుంచే సాధన చేస్తేనే ఇలాంటి క్రీడల్లో రాణించగలరని, విద్యాభారతి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమని పేర్కొన్నారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, నేషనల్ గేమ్స్‌లో ఇప్పటికే మల్లఖంబ్ చేరిందని, మిగిలిన క్రీడల మాదిరిగానే ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు కూడా అడ్మిషన్ల నుంచి ఉద్యోగ అవకాశాల వరకు సరైన గుర్తింపు లభిస్తుందని వివరించారు. కబడ్డీ తరహాలోనే మన దేశీయ ప్రాచీన క్రీడ అయిన మల్లఖంబ్ కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భాగం కావాలని ఆకాంక్షించారు. ఈ దిశగా క్రీడను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి ఎంపీ భరత్‌తో పాటు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కృషి చేస్తామని వెల్లడించారు.

 ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా కేంద్రం ఛైర్మన్ ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త కె.వి.ఎస్.కె. ప్రసాద్, జిల్లా మల్లఖంబ్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజు శివాజీ, భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి వి.ఆర్. సత్యనారాయణ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.