ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

0
2

 భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.అనుమతులు లేని లేఅవుట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీ అనుమతి పొందిన లేఅవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని, అనధికార లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే గతంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని డీడీలు చెల్లించి, ప్రస్తుతం బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2027 మార్చి నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, 29, 30వ వార్డుల ప్రజలు పాల్గొన్నారు.