చంద్రబాబుకు ఇప్పుడు యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది: పాన్ ఐఐటీ సమ్మిట్ లో మంత్రి లోకేశ్.

0
3

ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం అనే బలమైన సాఫ్ట్‌వేర్‌కు, యువతతో నిండిన చురుకైన హార్డ్‌వేర్ టీమ్ ఇప్పుడు అండగా నిలిచిందని, ఈ అరుదైన కలయికతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ‘పాన్ ఐఐటీ సమ్మిట్ – 2026’లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తామని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని మార్చడమే తమ ఉమ్మడి లక్ష్యమని అన్నారు.

 

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక యంగ్ హార్డ్‌వేర్ టీమ్ అండగా ఉంది. మా శాసనసభ్యుల్లో 50 శాతం మంది మొదటిసారి గెలిచినవారే. 25 మంది మంత్రులలో 17 మంది తొలిసారి మంత్రులయ్యారు. అనుభవజ్ఞమైన సాఫ్ట్‌వేర్‌కు, ఈ యువ, డైనమిక్ హార్డ్‌వేర్ కలయికే నేటి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలన్నదే మా స్పష్టమైన విజన్” అని లోకేశ్ వివరించారు. 5 లక్షల మందికి పైగా ఐఐటీ గ్రాడ్యుయేట్లను కలిపే పాన్ ఐఐటీ సదస్సు ఏపీలో జరగడం ఆనందంగా ఉందన్నారు.