కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే!

0
2

కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే!

రూ.5,500 బోనస్ నిర్ణయంపై ఏఐటీయూసీ ఆగ్రహం – కార్మికుల నిరసనను ఎదుర్కోక తప్పదు: యర్రగాని కృష్ణయ్య

కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు. గత సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, దసరా పండుగ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.25 వేల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ, గత ఏడాది మాదిరిగానే కేవలం రూ.5,500 మాత్రమే బోనస్‌గా నిర్ణయించడం కార్మికుల శ్రమను అవమానించడమేనని మండిపడ్డారు.

మంగళవారం కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఉత్పత్తి, రక్షణ, రవాణా, సేవా రంగాలతో పాటు సంస్థ లాభాల పెరుగుదలలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎండనక, వాననక అహర్నిశలు శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు.

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ప్రమాదాల మధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంతటి కష్టనష్టాలను భరిస్తూ సంస్థకు సేవలందిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

సంస్థ లాభాల్లో కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై ఉందని కృష్ణయ్య స్పష్టం చేశారు. పండుగ సమయంలో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సింది పోయి, అరకొర బోనస్‌తో సరిపెట్టడం అన్యాయమని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.25 వేల దసరా బోనస్ చెల్లించాలని మరోసారి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో కార్మికుల ఆగ్రహాన్ని, నిరసనలను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అనసూర్య, ఎస్. లక్ష్మి, సారయ్య, వాసవి, శాంత, పద్మ, నిర్మల, శంకర్, సాగర్, శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.