సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

0
3

హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రాజ్ రాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కార్మికులకు 34 శాతం లాభాల వాటా

సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా కల్పించే అంశాన్ని సమావేశంలో ప్రకటించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ అందించనున్నట్లు వెల్లడించారు. సంస్థ అభివృద్ధిలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకమని పేర్కొంటూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పెండింగ్ ఉద్యోగాల సమస్యపై దృష్టి

సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల సమస్యను 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మికుల పిల్లలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.