హెచ్ఐవీ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!

0
1

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఐవీ నివారణ కార్యక్రమాలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఏఆర్‌టీ చికిత్స అందించాలని ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో HIV/AIDS నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఎయిడ్స్‌–కుష్టు వ్యాధి నివారణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ART కేంద్రాలు, ICTCలు, DSRCలు, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (TI) స్వచ్ఛంద సంస్థలు, CSC-VIHAAN 2.0, YRG లింక్ వర్కర్ పథకాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ఆయా కేంద్రాల్లో సేవల పనితీరు, కార్యక్రమాల పురోగతిని అధికారులు సమీక్షించారు.

HIV పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలను మరింత బలోపేతం చేయాలని, HIVతో జీవిస్తున్న వ్యక్తులను సకాలంలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్సకు అనుసంధానించాలని డాక్టర్ ప్రసాద్ సూచించారు. లబ్ధిదారులకు నిరంతర సేవలు అందించడం, వారిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమాల అమలులో సిబ్బంది మధ్య సమన్వయం పెంపొందించాలని, రికార్డులను ఖచ్చితంగా నిర్వహిస్తూ నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. సేవల్లోని లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా HIV/AIDS నివారణ, చికిత్స, సంరక్షణ, సహాయక సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.