రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – బీఆర్ఎస్ పార్టీ డిమాండ్

0
3

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

రైతులకు సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా లభించక, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూ, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

రాష్ట్రంలో జలవిద్యుత్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించకుండా, ఎల్‌నినో ప్రభావాన్ని కారణంగా చూపిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు. సమస్యలకు అధికారులే కారణమన్నట్లుగా వారిని తప్పుబట్టడం, సస్పెన్షన్ల పేరుతో బెదిరించడం కంటే, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి.

 

దేశ ఆహార భద్రతలో తెలంగాణ రైతాంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తి, బియ్యం సరఫరాలో తెలంగాణ రైతులు గణనీయమైన భాగస్వామ్యం అందిస్తున్నారు. అలాంటి రైతుల పంటలు ఎండిపోతే రాష్ట్ర రైతాంగానికే కాకుండా దేశ ఆహార భద్రతకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి.

 

మూసీ ప్రాజెక్టులు, సౌత్ సిటీ వంటి ఇతర అంశాలపై దృష్టి సారిస్తూనే, రైతుల ప్రస్తుత సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే కింది చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

 

1. సాగునీటి విడుదల: పంటలు ఎండిపోకుండా అవసరమైన ప్రాంతాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి.

2. నిరంతర విద్యుత్ సరఫరా: వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి.

3. పంట పెట్టుబడి సాయం: రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించాలి.

4. యూరియా సరఫరా: రైతులకు అవసరమైన ఎరువులను ఎలాంటి కొరత లేకుండా సమయానికి అందుబాటులో ఉంచాలి.

5. నష్టపరిహారం: నీరు, విద్యుత్ కొరత కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలి.

6. మోటార్లు, బోర్ల మరమ్మతులు: విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతే, బోర్లు దెబ్బతింటే రైతులకు ఆర్థిక సహాయం అందించి మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

7. గృహ విద్యుత్ సరఫరా: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాలకు కూడా అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.

 

రైతుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా, వారి జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా గుర్తించాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలి.

 

రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. రైతులకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం, నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తునo అని బిగాల గణేష్ గుప్తా మాజీ MLA  అన్నారు