Madanapalle: మదనపల్లె, అన్నమయ్య, కడప జిల్లాల్లో రాత్రివేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మదనపల్లె సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కురబలకోట మండలం ఎరుకులపల్లికి చెందిన ఇరగ అశోక్ (23), రాయచోటి మండలం గుట్టకింద హరిజనవాడకు చెందిన గువ్వ ఆనంద్ బాబు (24)గా గుర్తించారు. వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం తొమ్మిది దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 185 గ్రాముల బంగారు ఆభరణాలు, 450 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు ప్రసాద్, కృష్ణమోహన్ మీడియాకు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ రాజారెడ్డి, పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్బీ సీఐ సదాశివ, ఎస్ఐలు నరసింహుడు, హరిహర ప్రసాద్, చిన్నమండ్యం ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.










