మంచిర్యాల: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పోటీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.పోలీసుల సేవలు, త్యాగాలు, విధి నిర్వహణలో వారి ప్రతిభను ప్రతిబింబించేలా ఫోటోలు, షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలని సూచించారు. ఆసక్తి గలవారు పోలీసులకు సంబంధించిన అంశాలపై తీసిన మూడు ఫోటోలు, మూడు నిమిషాలకు మించని ఒక షార్ట్ ఫిలింను ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా రామగుండం పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో ఉండాలని, షార్ట్ ఫిలింను పెన్డ్రైవ్లో పూర్తి వ్యక్తిగత వివరాలతో అందజేయాలని సూచించారు. కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన మూడు ఉత్తమ ఫోటోలు, మూడు ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ను రాష్ట్రస్థాయి పోటీలకు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి పంపించనున్నట్లు వెల్లడించారు.యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసుల సేవలు, త్యాగాలను సమాజానికి చాటిచెప్పేలా తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించాలని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.










