“పలాసలో మెగా వైద్య శిబిరం: 170 మందికి ఉచిత వైద్య సేవలు”

0
8

పలాస, అక్టోబర్ 16: వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ టి. పాపినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. డాక్టర్ సి.హెచ్. రఘురాం (సీఏఎస్), డాక్టర్ ఆర్. చిన్ననాయుడు (ఆర్థోపెడిక్), డాక్టర్ కె. మోహన్ బాబు (జనరల్ మెడిసిన్), డాక్టర్ సుశీల (స్త్రీ, ప్రసూతి వైద్య నిపుణురాలు), డాక్టర్ బొడ్డేపల్లి రమ్య (ఈఎన్టీ), డాక్టర్ నాగశ్రీ రేఖ (కంటి వైద్య నిపుణురాలు), డాక్టర్ మనోహర్ (మత్తు వైద్య నిపుణులు), డాక్టర్ అపర్ణ (దంత వైద్య నిపుణురాలు), డాక్టర్ వినోద్ కుమార్ (నవజాత శిశు వైద్య నిపుణులు), డాక్టర్ స్వరూప్ (ఎం.ఎస్., జనరల్ సర్జన్), డాక్టర్ జ్యోత్స్న (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్), డాక్టర్ చాందిని (చిన్నపిల్లల వైద్య నిపుణురాలు) సేవలు అందించారు.

శిబిరంలో సుమారు 170 మంది రోగులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు, చికిత్సలు పొందారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వైద్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి హెడ్ నర్స్ శ్రీమతి ఉమాదేవి, జూనియర్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్‌తో పాటు వైద్య, పారామెడికల్ సిబ్బంది పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు. ప్రజలు ఇటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.