ప్రజాస్వామ్య గొంతుకల అణచివేత పై జగన్ నిలదీయుతకు జ్యోతిబాపూలే అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు మద్దతు

0
1

 న్యూఢిల్లీ.  అశుతోష్ రాంకా మరియు సౌరవ్ దాస్ అరెస్టుల వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను కలవరపరుస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై బలంగా గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జ్యోతి బా ఫూలే ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు.భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న అరెస్టులు, రాజ్యాంగ సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తిన వారిని లక్ష్యంగా చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని, ఇటువంటి సమయంలో జగన్ మోహన్ రెడ్డి లాంటి ప్రముఖ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడటం ధైర్యసాహసాలతో కూడిన చర్య అని ఆయన అన్నారు.ముఖ్యంగా ఎన్నికల సంఘం లాంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆవశ్యకతను జగన్ గారు ఎత్తి చూపడం చాలా కీలకమని పోతల ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని, ఆ ప్రక్రియలో ఏ చిన్న అనుమానానికి తావు లేకుండా, ప్రతి ఓటుకు విలువ, ప్రతి గళానికి గుర్తింపు ఉండేలా ఈసీఐ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, పౌరుల హక్కులను కాపాడటం, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడం అనేది ఒకరిద్దరి బాధ్యత కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి నాయకుడు, ప్రతి సంఘం, ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత అని, సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని పోతల ప్రసాద్ నాయుడు తన ప్రకటనలో స్పష్టం చేశారు.