జూలూరుపాడు 400 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ!

0
1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై టిజి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరు, విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం, రాబోయే సీజన్‌లో పెరగనున్న లోడ్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, విద్యుత్ వ్యవస్థలోని కీలక పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సాంకేతిక వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశాలను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎండీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగుడెం ఎస్ఈ జి .మహేందర్ , డి.ఈ కొత్తగూడెం తదితరులు పాల్గొన్నారు.