Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలు వాహనాలు ధ్వంసం, నేతలకు గాయాలు.

0
2

Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర రసాభాసగా మారింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్ల దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు ఒకే సమయంలో రావడంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం చేసుకున్న రాళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో పలు వాహనాల అద్దాలు పగిలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పుంగనూరు పట్టణంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.