స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో చెలరేగిన హింసకు సంబంధించి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాల్లో పలువురు రౌడీషీటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
పుంగనూరు, రాయచోటిలో మీడియాతో మాట్లాడిన డీఐజీ, ఘటన వివరాలను తెలిపారు. “ఉదయం 9 గంటలకు ఎంపీ కాన్వాయ్ వచ్చింది. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా నామినేషన్ కేంద్రం గేట్లను ఢీకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి, ఘర్షణలు జరిగాయి” అని వివరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీఎస్పీ ప్రసాద్ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.










