20 గుంటల రామాలయ స్థలంపై అక్రమ నిర్మాణాలు?
● సర్వే నంబర్ 169లోని చిలకమఠం రామాలయ భూమిని పరిరక్షించాలని జేఏసీ నాయకుడు పట్లోళ్ల సురేందర్‌రెడ్డి వినతి
● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేత
అల్వాల్, అక్టోబర్ 17: అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాచీన చిలకమఠం రామాలయానికి చెందిన భూమి పరిరక్షణపై వివాదం తెరపైకి వచ్చింది.
సర్వే నంబర్ 169లో ఉన్న 20 గుంటల దేవుడి మాన్యం 22A(B) పరిధిలో ఉండగా, ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరతరాలుగా అల్వాల్ ప్రజలు చారిత్రక ఆలయ స్థలంగా భావిస్తూ కాపాడుకుంటున్న భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై జేఏసీ నాయకుడు పట్లోళ్ల సురేందర్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేసి, ఆలయ భూమిని కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించి భూమి హద్దులను నిర్ధారించడంతోపాటు అక్రమ నిర్మాణాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
అల్వాల్ ప్రజల మనోభావాలకు సంబంధించిన ఆలయ భూమిని నిర్లక్ష్యం చేయడం సరికాదని సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి, భూమి హద్దులను గుర్తించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం వాటిని తొలగించి ఆలయ స్థలాన్ని పరిరక్షించాలని కోరారు.
సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సురేందర్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డోలి రమేష్, శోభన్‌బాబు, అరుణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










