నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం

0
15

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో గతంలో ప్రారంభమై నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతోపాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలు చేపడతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి తలాసు శ్రీపద్మ తెలిపారు. పలాసలోని జి.ఎం.ఇ. కాలనీ ‘ప్రగతి భవన్‌’లో మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

తనకు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి, సీదిరి అప్పలరాజుకు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎన్నికల కోడ్‌, ప్రభుత్వం మారడం వంటి కారణాలతో గతంలో కొన్ని పనులు మధ్యలో ఆగిపోయాయని, వాటిని తిరిగి చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని వివరించారు.

ప్రధాన హామీలు

  • చిరు వ్యాపారులకు కాంప్లెక్స్‌: కేటీ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారికి శాశ్వత కాంప్లెక్స్‌ నిర్మిస్తాం. గతంలో ఐడీఎస్‌ఎంటీ నిధులతో చేపట్టిన ఈ పని అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఆగిపోయింది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా దీన్ని పునఃప్రారంభిస్తాం. వీధి వ్యాపారులకు ప్రత్యేక అంగళ్లు ఏర్పాటు చేసి, రైతు బజార్‌ను పునరుద్ధరిస్తాం.
  • ఆడిటోరియంలు: కాశీబుగ్గ సమీపంలోని పెసరపాడు వద్ద రెండున్నర ఎకరాల్లో ఆడిటోరియం కోసం గతంలో ప్రాథమిక పనులు, కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారు. ఆ పనులను పూర్తి చేస్తాం. పలాసలోనూ స్థలం సేకరించి ఆడిటోరియం, ఇండోర్‌ క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. సామాన్యులకు అందుబాటు ధరల్లో, జీడి కార్మికులు కూడా వినియోగించుకునేలా వీటిని తీర్చిదిద్దుతాం.
  • పార్కులు: ఎర్రసాగరం, కుంకుమ చెరువుల పరిసరాలను ముత్యాలమ్మ చెరువు తరహాలో వాకింగ్‌ ట్రాక్‌ సహా పార్కులుగా అభివృద్ధి చేస్తాం.
  • తాగునీరు: గతంలో సుమారు రూ.110 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్‌ పనులు కొన్ని అసంపూర్తిగా ఆగాయి. వాటిని పూర్తి చేసి నిరంతర తాగునీటి సరఫరాకు కృషి చేస్తాం.
  • విద్యుత్‌, పారిశుధ్యం: ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్‌ సేవలు తెచ్చి, వీలైనంత వరకు 24 గంటల్లో సమస్యలు పరిష్కరించేలా వ్యవస్థను రూపొందిస్తాం.
  • రహదారులు: కోసంగిపురం నుంచి చిన్నబడారం వరకు డబుల్‌ రోడ్లు, మధ్యలో లైటింగ్‌ ఏర్పాటు చేస్తాం. ప్రధాన రహదారులకు అనుసంధానంగా సబ్‌ రోడ్లను అభివృద్ధి చేస్తాం.
  • గ్రంథాలయాలు: పలాస, కాశీబుగ్గ గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆధునిక కంప్యూటరైజ్డ్‌ గ్రంథాలయాలుగా మారుస్తాం.
  • శ్మశాన వాటిక: జగనన్న కాలనీ వాసుల శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ భూములను పరిశీలించి స్థలం కేటాయింపునకు కృషి చేస్తాం.
  • ప్రత్యేక కమిటీలు:ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మహిళలు, వ్యాపారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తాం.

ప్రజల భాగస్వామ్యంతో ప్రాధాన్యాలను నిర్ణయించి, నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని శ్రీపద్మ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు శిష్టు గోపీ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పి.వి.సతీష్‌ కుమార్‌, బడగల బాలచంద్రుడు, బెల్లాల శ్రీనివాసరావు, వాయలపల్లి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.