*పలాస–కాశీబుగ్గ అభివృద్ధికి ఐదేళ్లుగా విశేష కృషి*
*వంశధార నీటి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు పరిష్కారం*
*అన్ని వార్డులకూ సమాన ప్రాధాన్యమిచ్చాం: మున్సిపల్ మాజీ చైర్మన్ బల్లా గిరిబాబు*
*పలాస:*
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ పాలకమండలి హయాంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ మాజీ చైర్మన్ బల్లా గిరిబాబు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిని తాలాసు శ్రీపద్మతో పాటు 36 వార్డుల్లోని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
జి.ఎం.ఇ. కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రగతి భవన్లో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి మంత్రి అప్పలరాజు సహకారం, పాలకమండలి సమష్టి కృషితో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
*తాగునీటికి ప్రత్యేక చర్యలు*
గతంలో పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, దాని పరిష్కారానికి వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చే సుమారు రూ.700 కోట్ల ప్రాజెక్టు కీలకమని గిరిబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పలాస–కాశీబుగ్గతో పాటు పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. సుమారు రూ.110 కోట్లతో పైప్‌లైన్ పనులు కూడా చేపట్టినట్లు తెలిపారు.
*రహదారులు, నిధుల వినియోగం*
కేటీ రోడ్డును 66 అడుగుల నుంచి 80 అడుగులకు విస్తరించి, ఇరువైపులా డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు నిర్మించామని, సుమారు 90 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని వివరించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.14.5 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.15 కోట్లు, జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.6–7 కోట్లను పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలకు వినియోగించామన్నారు.
*ఇళ్లు, విద్య, వైద్యం*
56 ఎకరాల విస్తీర్ణంలో జగనన్న కాలనీని ఏర్పాటు చేశామని, సుమారు 3,000 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. పలాస సమీపంలో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటుకు అప్పలరాజు కృషి చేశారన్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు, కిడ్నీ రోగులకు ఉపయోగపడే ఆసుపత్రి అభివృద్ధి, హెల్త్ సెంటర్ల ఏర్పాటుకూ ప్రాధాన్యమిచ్చామన్నారు. ఇంటింటికీ కొళాయిలు, పెన్షన్లు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణపైనా దృష్టి పెట్టామని తెలిపారు.
*అన్ని వార్డులకూ సమాన ప్రాధాన్యం*
తాను చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏ వార్డులో ఏ పార్టీ వారున్నారనే భేదం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టామని గిరిబాబు అన్నారు. టౌన్ ప్లానింగ్ సహా పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చామని, అధికార–ప్రతిపక్ష తేడా లేకుండా ప్రజలకు సేవలందేలా చూశామన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే తాలాసు శ్రీపద్మతో పాటు పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని, తాను చేపట్టిన పనులను పరిశీలించి ప్రజలు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో డాక్టర్ సీదిరి అప్పలరాజు, తాలాసు శ్రీపద్మ, పట్టణ అధ్యక్షుడు శిష్టు గోపి, మాజీ ఏఎంసీ చైర్మన్ పి.వి. సతీష్‌కుమార్, బడగల బాలచంద్రుడు, బెల్లాల శ్రీనివాసరావు, వాయలపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.










