పోలీసుల త్యాగాలతోనే తెలంగాణలో శాంతి, అభివృద్ధి.|

0
3

● గోషామహల్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్

● గత ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసు అమరులు.. తెలంగాణకు చెందిన నలుగురు

● నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో వందలాది మంది పోలీసుల ప్రాణత్యాగం

అల్వాల్, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో శాంతి, అభివృద్ధి సాధ్యమయ్యాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ పేర్కొన్నారు. 

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో బుధవారం నిర్వహించిన పరేడ్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు నివాళులర్పించారు.

ముఖ్యమంత్రితో కలిసి తాను కూడా అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించినట్లు డీజీపీ వెల్లడించారు.

గత ఏడాది కాలంలో దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యున్నత త్యాగం చేసిన 154 మంది పోలీసు అమరవీరుల్లో తెలంగాణకు చెందిన నలుగురు ఉన్నారని తెలిపారు.

కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అమరవీరుల పేర్లను చదివి వినిపించిన అనంతరం సంప్రదాయబద్ధంగా ‘శోక్ శస్త్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాను 1990వ దశకంలో నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన సమయంలో నక్సలిజం తీవ్రస్థాయిలో ఉండేదని సీవీ ఆనంద్ గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సంఖ్య అధికంగా ఉండేదని, వందలాది మంది సిబ్బంది చేసిన అసమాన త్యాగాల వల్లే నేడు తెలంగాణలో ప్రశాంత వాతావరణం, అభివృద్ధికి మార్గం సుగమమైందని తన ప్రసంగంలో ప్రస్తావించినట్లు తెలిపారు.

పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోందని డీజీపీ పేర్కొన్నారు. 

ఎక్స్‌గ్రేషియా పరిహార మొత్తాల పెంపు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు పోలీసు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు.

అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాను ప్రస్తావిస్తూ, పోలీసు సిబ్బంది సంక్షేమానికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను సమాజం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal