సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళులు అర్పించిన కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్
కొత్తగూడెం: భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, సమైక్యత కోసం ఆయన చూపిన ధైర్యం, నాయకత్వం, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన పటేల్ ఆశయాలు, సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.










