మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 4,018 దరఖాస్తులు.. 3,783కు ఆమోదం
అల్వాల్, నవంబర్ 2: తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తుల గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 8 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 50,908 దరఖాస్తులు నమోదైనట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 48,623 దరఖాస్తులు ఆమోదం పొందగా, 435 తిరస్కరణకు గురయ్యాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 4,018 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో 3,783 ఆమోదం పొందగా, నాలుగు తిరస్కరణకు గురయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 11,935 దరఖాస్తులు నమోదు కాగా, 11,378 ఆమోదం పొందాయి. హైదరాబాద్‌లో 9,858 దరఖాస్తులు రాగా, 9,616 ఆమోదం పొందినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ గడువు అక్టోబర్ 7తో ముగిసింది. ఆ తర్వాతి రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు నమోదవడం, వాటిలో అధిక శాతం ఆమోదం పొందడం పలు సందేహాలకు తావిస్తోంది.
దీనిపై వివరణ కోరగా, గణాంకాల తయారీలో సాంకేతిక లోపం కారణంగా గతంలో సమర్పించిన కొన్ని దరఖాస్తులు కూడా తాజా గణాంకాల్లో కనిపించి ఉండవచ్చని ఎన్నికల అధికారులు పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది.
అయితే ఫారం-7 దరఖాస్తు ఆమోదం పొందినంత మాత్రాన ఓటరు పేరు జాబితా నుంచి తొలగించినట్లు కాదని అధికారులు స్పష్టం చేశారు.
తొలగింపునకు గల కారణాలను పరిశీలించి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు జరుగుతుందని వివరించారు. తుది ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
#Sidhumaroju
Alwal










