ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రతీరోజూ తప్పనిసరిగా తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత గారు, అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గ్రామాల్లోని బోర్లు, మోటార్లు, ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు లేదా మోటార్ల మరమ్మతులు ఉంటే వెంటనే పనులు చేపట్టి పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కె.హరిత గారు ఆదేశించారు.










