కొత్తగూడెం విబి-జి రామ్ జి ద్వారా శాశ్వత అభివృద్ధి పనులు

0
3

శాశ్వత ఆస్తుల కల్పనకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. మురసు తుపాను నష్టం, వేసవి తాగునీరు, ఎల్‌నినో ప్రభావంపై పక్కా ప్రణాళికలు.

 

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విబి- జి రామ్ జి పథకం ద్వారా తాత్కాలిక పనులకు బదులుగా ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రానికి మోడల్గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

 

 

మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, కల్వర్టులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాలని, రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

విబి- జి రామ్ జి పథకం కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 375 రకాల పనులను సద్వినియోగం చేసుకొని శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలిపారు. చెరువులు, పంట కాలువల పూడికతీత, చెరువుకట్టల పటిష్టత, గ్రామీణ అంతర్గత రహదారులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గాలు, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల అదనపు తరగతి గదులు, అసంపూర్తి భవన నిర్మాణాలను ఈ పథకం కింద ప్రతిపాదించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ప్రయోజనం కలిగించే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు .

 

పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అర్హమైన పనులను కూడా విబి – జి రామ్ జి పథకం కింద ప్రతిపాదించాలని మంత్రి సూచించారు. రహదారుల మరమ్మతులు, మెటలింగ్, కల్వర్టులు, వంతెనలు, కాలువల పునరుద్ధరణ, అసంపూర్తి పనులను గుర్తించి కలెక్టర్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. పనుల మంజూరు కోసం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మురసు తుపాను కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంటలు, రహదారులు, కల్వర్టులు, వంతెనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టాలను నిబంధనల ప్రకారం నమోదు చేయడంతో పాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.

 

ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. దెబ్బతిన్న రహదారులకు శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని, అవసరమైన చోట గేబియన్ నిర్మాణాలు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 56 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, ఇతర నిర్మాణాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రాచలం–వెంకటాపురం రహదారి అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని, టెండర్ ప్రక్రియ పూర్తయినందున వెంటనే జీఎస్‌బీ పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఇసుక రవాణా కారణంగా రహదారి దెబ్బతినకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చిన్నపాటి నష్టాలకు తక్షణ మరమ్మతులు చేపట్టి, మంజూరైన పనులను వాతావరణం అనుకూలించిన వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

 

మల్లెపువ్వుల వాగు పరిధిలోని ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కంపను తొలగించి, పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వాగు బ్రిడ్జి ప్రారంభ ప్రాంతం నుంచి బ్రిడ్జి వరకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి నీటి నిల్వకు అనుకూలంగా శాశ్వత పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రతి పంట కాలంలో తాత్కాలిక పనులు చేపట్టి తొలగించే పరిస్థితి లేకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.

 

వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనుల కోసం విడుదలైన రూ.70 లక్షలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డీపీసీ, నాన్-జీవో పనులతో పాటు పెండింగ్ పునరుద్ధరణ పనులను కూడా ప్రతిపాదనల్లో చేర్చాలని సూచించారు. గంగారం ప్రాంతంలోని నీటి వనరులు, కాలువల అభివృద్ధి, అవసరమైన చోట చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో గతంలో ఉన్న వ్యక్తిగత తాగునీటి పథకాలు, బోర్‌వెల్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను పరిశీలించి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేలా పాత నీటి వనరులను సిద్ధంగా ఉంచాలన్నారు. అశ్వారావుపేట, పెద్దవాగు, అంకమ్మ చెరువు ప్రాంతాల్లో తాగునీటి పథకాల పనితీరును పరిశీలించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.

 

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 36 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో ఇసుక బస్తాలతో చేపట్టిన రక్షణ ఏర్పాట్లను పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన రెండు వరుసలకు అదనంగా అవసరమైతే ఐదు వరుసల వరకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు. యాతాల కుంట టర్నల్ లైనింగ్ పనులు మరో వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నందున ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి విడుదలకు అనుకూలమైన సమయంలోనే చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న జనవరి నుంచి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, వ్యవసాయ రంగాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. గత సంవత్సరాల వర్షపాతం, సెంట్రల్ వాటర్ కమిషన్ సమాచారం ఆధారంగా పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అన్నారు . ములకలపల్లి, చంద్రుగొండ, రెడ్డిపల్లి ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నందున మొక్కల సరఫరా, సాగు విస్తరణకు ఉద్యానవన శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి, మెట్ట పంటలతో పాటు జనుము, పిల్లిపెసర వంటి పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.

 

జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూమి అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టు తదుపరి చర్యల కోసం ఢిల్లీలోని సంబంధిత శాఖలతో సంప్రదింపులు కొనసాగించాలని తెలిపారు. కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, జూలూరుపాడు పట్టణాల్లో ప్రధాన రహదారుల మధ్య డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలోని పట్టణాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా, సుందరంగా కనిపించేలా మొక్కలు నాటి వాటిని నిరంతరం సంరక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పనుల నాణ్యత, మన్నికకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డిసిహెచ్ఓ రవిబాబు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.