మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (19) బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో శ్రీరాంపూర్ పోలీసులు అతడిని మంచిర్యాల RDO ఎదుట హాజరుపరిచారు.గతంలో పలు నేరాలకు పాల్పడిన నేపథ్యంలో సదరు యువకుడిని సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల RDO ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బైండోవర్ నిబంధనలను పాటించకుండా తిరిగి గొడవలు, నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దృష్టికి రావడంతో ఈ చర్యలు చేపట్టారు.శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో గురువారం యువకుడిని RDO ఎదుట హాజరుపరచగా, RDO నోటీసులు జారీ చేశారు. బైండోవర్ షరతులను ఉల్లంఘించినందుకు గడువులోగా రూ.1,00,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, చెల్లించని పక్షంలో ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్ వెల్లడించారు.బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ పోలీసులు హెచ్చరించారు.










